Wednesday, November 11, 2009

ఆమె

USA, Nov 11th 2009
ఆమె మనసొక అగ్నిగుండం
అల్లకల్లోలాల సముద్రం
సుడి గుండాల వలయం
ఆమె కిపుడు మధుర స్వప్నాలు లేవు
కమ్మని కలలురావు
ఆమె కన్నులు మూసుకుంటే కనిపించేది
మండుతున్న ధరలు మాడుతున్న కడుపులు
 సమాజానికి సవాల్ గా నిలచిన
సగటు మనుషుల బ్రతుకులు
నాటి పంటనందించే  రైతులు లేరు
వలస వెళ్ళిన వారి జీవితాలలో
వెలుగురేఖలు లేవు
ఆర్ధిక మాంద్యం అందర్నీ అట్టడుగుకు నెట్టేసింది
హాయిగా కన్నకలలని నిలువునా ముంచేసింది
అనుకోని ప్రమాదాలు ఊహించని పెనుతుఫానులు
పెడదారి పడుతున్న మనుషుల జీవన స్థితి గతులు
క్షణ క్షణం భయం భయం చెదరిన జీవన ప్రమాణం
నిరుత్సాహం మనిషి ధైర్యాన్ని నీరుగారుస్తుంటే
కాలం తమ నమ్మకాలను వమ్ముచేస్తుంటే
నింగికేదగాలన్నఆశలు అడియాసలౌతుంటే
పిరికితనం పిడికిలి బిగించి పిడిగుద్దులు గుద్దుతుంటే
విల విల లాడే తన వాళ్ళని చూసి
ఏ కమ్మని కలలు గంటుంది ?
ఏమని వాళ్ళని దీవిస్తుంది ?
తన పైనే భారమేసి తలమునకలౌతూ
పుట్టెడు బాధను భరిస్తున్న వాళ్ళని చూసి
పుడమి తల్లికి పుట్టెడు దుఃఖం గాక మరేముంది ?
కళ కళ లాడాలని తపన పడుతున్న తనతో
విధి ఆడుతున్న వింతాటలో
నలుగుతున్న మనుషుల మనస్థితులను జూసి
ఆమెకిపుడు మధుర స్వప్నాలు లేవు
ఆమె కంటికి ఏ కమ్మని కలలు రావు

Friday, November 6, 2009

మా అమ్మ సూక్తులు

USA, Nov 6th 2009
అక్షరాలూ రాని తల్లి - అ ఆ లు దిద్దించింది
చదువురాని మా అమ్మ - సంస్కారం నేర్పించింది

చెడుచూడకంది - చెడు మాట్లాడకంది
చెడు వినుటకు చెవులకు - పని చెప్పోద్దంది

సత్యాన్నే పలకమంది - సద్గుణాలు నేర్వమంది
అసూయా ద్వేషాలకు - ఆమడలో ఉండమంది

చాడీలు చెప్పకంది - చెప్పుడు మాటినకంది
మనసు మలినమయ్యాక - మనిషికి సుఖముండదంది

అనుమానం పెనుభూతం - పట్టుకుంటే వదలదంది
పచ్చ కామెర్ల రోగి - కంటి చూపు పచ్చదంది

కూడని విషయాలలో - పోలికలు కూడదంది
అరచేతి లోని వెళ్ళు - అన్ని ఒకటిగా లేవంది

అమ్మనీకు ముద్దితే - ఆప్యాయత చూపమంది
పరుల తల్లి లోన కూడా - తన తల్లి ని చూడమంది

క్రమశిక్షణ లేని బ్రతుకు - కాలసర్పమంటిదంది
కాలం గడిచే కొద్ది - కాటేయక మానదంది

ధనం మీద వ్యామోహం - దరికి చేరనియ్యకంది
వ్యామోహం వ్యసనమైతే - బ్రతుకంతా నరకమంది

కష్టాలు నష్టాలు - కలిసి నన్ను వేధిస్తే
కాలే కొలిమి లోన నన్ను - ఇనుప ముక్క కమ్మంది

కష్టపడ్డ మనిషికెపుడు - నష్టాలు లేవంది
అంతిమ విజయం కోసం - ఆశ తో చూడమంది

తల్లంటే పిల్లలకు - కరిగే కొవ్వోత్తంది
కరిగే తన గుణం లోన - వెలుగును చూడాలంది

పరులకు ఆదర్శంగా - పది కాలాలుండమంది
పరుల హితము కోరడమే - పరమేశునికిష్టమంది

ఇది మా అమ్మగారైన కీ.శే. శ్రీమతి మధురమ్మ రెండవ వర్ధంతి సందర్భంగా  నేను ఆమెకు సమర్పించుకుంటున్న నా స్ముర్త్యాంజలి..

Thursday, November 5, 2009

నేల రాలిన తార..

తళ తళలాడిన తార
తళుక్కు మన్న తార 
వినీలాకాశం లో మిల మిల మెరిసిన తార
తనను నమ్మిన వారి తల రాతలు మార్చిన తార
తనను కొలిచినవారి కొంగు బంగారమైన తార
కొత్త కాంతుల మధ్య కొలువు తీరిన తార
ఏ తారలైన తన సాటిలేరన్న తార
జిలుగు వెలుగులు చిమ్మి మురిపించిన తార
గుండె గుండె కు తాను వెలుగైన తార
కోటి తారల మధ్య కొత్త చంద్రునివోలె
దినదినము పెరిగి నిండిన తార
రాహువే మింగిందో కేతువే పట్టిందో
ఒక్క నిముషములోనే  ఉక్కిరి బిక్కిరై
ఆకాశమే వీడి నేలపై రాలింది
బ్రతుకంటే ఇంతే భయపడకు అంది
మళ్ళి జన్మిస్తే జగతి తానంటూ
మట్టి లో కలిసి మౌనమై మిగిలింది


ఇది YSR మరణo గురించి వార్తల్లో చూస్తున్న రోజున నా హృదయ స్పందన ...

Wednesday, November 4, 2009

కంటే కూతుర్నే కను

ఊహ కు ఊపిరినిచ్చి
ఆశ కు ప్రాణం పోసి
ఆశయ సాధన లో ఆయుధమై
అనుక్షణం అండగా నిలిచి
అమ్మ ఆనందం కోసం అహర్నిశం పాటుపడే కూతుర్లను చూసి
హృదయం పులకించి పోదా !
ఎవరన్నారు?
ఆడపిల్లలు అమ్మానాన్నల బలహీనతని ...
కాదు... కానే కాదు
కష్ట సుఖాలను కలసి పంచుకునే
మనసున్న పిల్లలైతే
నేనంటాను ఎన్ని జన్మలైనా "కంటే కూతుర్నే కను" అని.

ఇది ఆడపిల్లలను బలహీనతగా భావించే సమాజం పట్ల నా హృదయ స్పందన ...

Tuesday, November 3, 2009

నా మనవడు Rhushath

USA, September 2nd 2009
ఎంత ఎదిగిపోయాడో ....నే చూసిన చిన్నవాడు
ఎంతగానో ఎదిగాడు.... నా ముద్దుల మనవడు
అమ్మా అని అన్నాడు... అమ్మమ్మని పిలిచాడు
ముద్దు ముద్దు మాటల్లో ... ముద్దులోలుకుతున్నాడు
అచ్చమైన తెలుగు లో ... అడిగే సందేహాలు
చెప్పలేని జవాబులు ...చెప్పక తప్పేనా?
చెకుముకి ఆ చిన్నవాడు ...చెంగు చెంగు మంటుంటే
చూసేందుకు కళ్ళున్న ... చూపు చాలదేమో !
ఆటల్లో నాన్న కు ధీటు ...నేనంటాడు
అమ్మ చెప్పు మాటలు ....బుద్ధిగా వింటాడు
కథ చెప్తే కాని తాను ... నిదురపోనంటాడు
కథలింటూ నిడురపోతూ ..కలలెన్నో కంటాడు
దేవుడంటే ఎవరని ...అడిగే ఆ చిన్నవాడు
చెప్పింది వినగానే ...చేతులెత్తి మొక్కుతాడు
హనుమ అంటే ఇష్టం ...అంటూ ఆ చిన్నవాడు
బలం లోన తనుకూడా ...హనుమంతున్నంటాడు ..

ఇది మూడున్నర సంవత్సరాల నా ముద్దుల మనవడు Rhushath మాటలు, చేతలకు నా హృదయ స్పందన !

Tuesday, October 27, 2009

ఆంధ్ర కూచిపూడి కి హారతి పట్టిన వేళ ...

USA, October 21st 2009

ఆహార్యం అభినయం అనుసంధానమై
ఆంధ్ర కూచిపూడి కి హారతి పట్టిన వేళ
కళాపోషకులు కళాప్రియులు
కళామతల్లికి నీరాజనాలర్పించిన వేళ
ముద్దులొలికే చిన్నారుల ముద్రలతో
ప్రథమ పూజితునికి పాదాభివందనం
భాషకు భాష్యం చెప్పిన భావాలు
లయ బద్ధంగా నర్తించిన పాదాలు
శ్రుతి తప్పని స్వరగతులు
హృదయాలను చుంబించిన నృత్య రీతులు
హంస నడకలా ! అలవికాని హోయలా !
నటరాజ నర్తన లోని వివిధ భంగిమలా !
సంస్కృతి కి సజీవ రూపమై
సాంప్రదాయానికి ఒక నిర్వచనమై
సభికులకు సమ్మోహనమై
సంతోషానికి ఆలవాలమై
అనిర్వచనీయమైన అనుభూతి
అదో లోకం లో విహరిస్తున్న రీతి
జన్మనిచ్చినవారి జన్మ ధన్యమైందా
విద్య నేర్పినవారి కృషి ఫలించిందా
అంతర్లీనమైన ప్రతిభకు అంకురార్పణ
అతిధిదేవో భవా అంటూ
చిన్నారులు చేసిన నాట్య ప్రదర్శన

ఇది అమెరికా లో వంశి నాట్య కళాశాల విద్యార్థుల కూచిపూడి నృత్య ప్రదర్శనకు నా హృదయ స్పందన..

Monday, October 26, 2009

సంబరం అంబరాన్నంటిన వేళ ...

Place : USA
Date: August 29th 2009

ముంగిట విరిసిన ముద్ద బంతులు
మురిపాలోలికే గులాబీలు
పచ్చ పచ్చని పచ్చిక బయళ్ళు
రారమ్మని ఆహ్వానిస్తుంటే
అతిథుల రాక ఆరంభం
ఆ ఇంటికి తెచ్చెను ఆనందం
చిలుకల పలుకుల చిన్నారులు
బుడిబుడి నడకల బుజ్జాయిలు
చతురోక్తులను యుక్తిగా విసిరే పతి దేవుళ్ళు
చెలిమి కలిమిలో కళకళలాడే కాంతా మణులు
ఎటు చూసిన సందడి సందడి
ఆ ఇంతి సీమంతపు సవ్వడి
స్వదేశ సంస్కృతీ సాంప్రదాయాలు
సరిగమ పలికిన సమ్మేళనం
శుభాకాంక్షలు శుభమస్తంటూ
దీవేనలిచ్చిన సమారోహం
ఆహా ! ఏమి ఈ సంబరం
అంటూ సంతోషం అంబరాన్నంటిన వేళ ....

ఇది అమెరికా లో నివసిసిస్తున్న నా కూతురు సీమంతం జరిగిన సందర్భంలో నా హృదయ స్పందన..