Wednesday, November 11, 2009

ఆమె

USA, Nov 11th 2009
ఆమె మనసొక అగ్నిగుండం
అల్లకల్లోలాల సముద్రం
సుడి గుండాల వలయం
ఆమె కిపుడు మధుర స్వప్నాలు లేవు
కమ్మని కలలురావు
ఆమె కన్నులు మూసుకుంటే కనిపించేది
మండుతున్న ధరలు మాడుతున్న కడుపులు
 సమాజానికి సవాల్ గా నిలచిన
సగటు మనుషుల బ్రతుకులు
నాటి పంటనందించే  రైతులు లేరు
వలస వెళ్ళిన వారి జీవితాలలో
వెలుగురేఖలు లేవు
ఆర్ధిక మాంద్యం అందర్నీ అట్టడుగుకు నెట్టేసింది
హాయిగా కన్నకలలని నిలువునా ముంచేసింది
అనుకోని ప్రమాదాలు ఊహించని పెనుతుఫానులు
పెడదారి పడుతున్న మనుషుల జీవన స్థితి గతులు
క్షణ క్షణం భయం భయం చెదరిన జీవన ప్రమాణం
నిరుత్సాహం మనిషి ధైర్యాన్ని నీరుగారుస్తుంటే
కాలం తమ నమ్మకాలను వమ్ముచేస్తుంటే
నింగికేదగాలన్నఆశలు అడియాసలౌతుంటే
పిరికితనం పిడికిలి బిగించి పిడిగుద్దులు గుద్దుతుంటే
విల విల లాడే తన వాళ్ళని చూసి
ఏ కమ్మని కలలు గంటుంది ?
ఏమని వాళ్ళని దీవిస్తుంది ?
తన పైనే భారమేసి తలమునకలౌతూ
పుట్టెడు బాధను భరిస్తున్న వాళ్ళని చూసి
పుడమి తల్లికి పుట్టెడు దుఃఖం గాక మరేముంది ?
కళ కళ లాడాలని తపన పడుతున్న తనతో
విధి ఆడుతున్న వింతాటలో
నలుగుతున్న మనుషుల మనస్థితులను జూసి
ఆమెకిపుడు మధుర స్వప్నాలు లేవు
ఆమె కంటికి ఏ కమ్మని కలలు రావు

No comments:

Post a Comment

Abhipraayalanu aahwaanisthaanu...