Tuesday, October 27, 2009

ఆంధ్ర కూచిపూడి కి హారతి పట్టిన వేళ ...

USA, October 21st 2009

ఆహార్యం అభినయం అనుసంధానమై
ఆంధ్ర కూచిపూడి కి హారతి పట్టిన వేళ
కళాపోషకులు కళాప్రియులు
కళామతల్లికి నీరాజనాలర్పించిన వేళ
ముద్దులొలికే చిన్నారుల ముద్రలతో
ప్రథమ పూజితునికి పాదాభివందనం
భాషకు భాష్యం చెప్పిన భావాలు
లయ బద్ధంగా నర్తించిన పాదాలు
శ్రుతి తప్పని స్వరగతులు
హృదయాలను చుంబించిన నృత్య రీతులు
హంస నడకలా ! అలవికాని హోయలా !
నటరాజ నర్తన లోని వివిధ భంగిమలా !
సంస్కృతి కి సజీవ రూపమై
సాంప్రదాయానికి ఒక నిర్వచనమై
సభికులకు సమ్మోహనమై
సంతోషానికి ఆలవాలమై
అనిర్వచనీయమైన అనుభూతి
అదో లోకం లో విహరిస్తున్న రీతి
జన్మనిచ్చినవారి జన్మ ధన్యమైందా
విద్య నేర్పినవారి కృషి ఫలించిందా
అంతర్లీనమైన ప్రతిభకు అంకురార్పణ
అతిధిదేవో భవా అంటూ
చిన్నారులు చేసిన నాట్య ప్రదర్శన

ఇది అమెరికా లో వంశి నాట్య కళాశాల విద్యార్థుల కూచిపూడి నృత్య ప్రదర్శనకు నా హృదయ స్పందన..

Monday, October 26, 2009

సంబరం అంబరాన్నంటిన వేళ ...

Place : USA
Date: August 29th 2009

ముంగిట విరిసిన ముద్ద బంతులు
మురిపాలోలికే గులాబీలు
పచ్చ పచ్చని పచ్చిక బయళ్ళు
రారమ్మని ఆహ్వానిస్తుంటే
అతిథుల రాక ఆరంభం
ఆ ఇంటికి తెచ్చెను ఆనందం
చిలుకల పలుకుల చిన్నారులు
బుడిబుడి నడకల బుజ్జాయిలు
చతురోక్తులను యుక్తిగా విసిరే పతి దేవుళ్ళు
చెలిమి కలిమిలో కళకళలాడే కాంతా మణులు
ఎటు చూసిన సందడి సందడి
ఆ ఇంతి సీమంతపు సవ్వడి
స్వదేశ సంస్కృతీ సాంప్రదాయాలు
సరిగమ పలికిన సమ్మేళనం
శుభాకాంక్షలు శుభమస్తంటూ
దీవేనలిచ్చిన సమారోహం
ఆహా ! ఏమి ఈ సంబరం
అంటూ సంతోషం అంబరాన్నంటిన వేళ ....

ఇది అమెరికా లో నివసిసిస్తున్న నా కూతురు సీమంతం జరిగిన సందర్భంలో నా హృదయ స్పందన..